News

మనుషులను చీలుస్తున్నారు.... రాహూల్


భారతరత్న డా. అంబేడ్కర్ చేసిన కృషి కేవలం ఒక దేశానికి లేదా ఒక సముదాయానికి పరిమితమైంది కాదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అంబేడ్కర్ జన్మించిన మధ్యప్రదేశ్‌లోని మవూ పట్టణంలో రాహుల్ మంగళ వారం ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను ప్రారంభించింది. వచ్చే ఏప్రిల్ 14 – అంబేడ్కర్ 125వ జయంతి దాకా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. మవూ పట్టణంలో అంబేడ్కర్ స్మారకచిహ్నం వద్ద మంగళవారం శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ప్రసంగిస్తూ రాహుల్ మనుషుల్ని చీలదీసే భావజాలం చాలా ప్రమాదకరం అని అన్నారు. గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌ల త్రయం పౌరులందరికీ సమాన ఓటుహక్కు కల్పించిందని అంటూ, దళితుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని అన్నారు. ‘ప్రజల్లో ఒక వర్గాన్ని చులకనగా చూసే భావజాలంతో మన దేశానికి ముప్పుందనే విషయం మర్చిపోవద్దు. అంబేడ్కర్ తన జీవిత కాలమంతా ఏ గోడలకు వ్యతిరేకంగా పోరాడారో ఆ గోడలనే ఈ శక్తులు బలోపేతం చేస్తున్నాయి. మనిషికి వ్యతిరేకంగా మనిషిని నిలబెట్టే ఈ సిద్ధాంతాలు మనల్ని బలహీనం చేస్తాయి’ అని రాహుల్ చెప్పారు. బిజెపి పేరు గానీ, బిజెపి నేతల పేర్లు గానీ ఎత్తకుండానే వీళ్ల సిద్ధాంతాలతో పోరాడడం మామూలు విషయం కాదని రాహుల్ అన్నారు.


కుల నిర్మూలన అనే అంబేడ్కర్ ఆశయం నేటికీ నెరవేరలేదని రాహుల్ స్పష్టం చేశారు. నేటికీ మన దేశంలో కులానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయనన్నారు. అంబేడ్కర్ పీడనపై పోరాటానికి చిహ్నమని గాంధీ అన్నారని రాహుల్ పేర్కొన్నారు. ‘దళితుల, బలహీన వర్గాల జీవితాల్లో బాబా సాహెబ్ అంబేడ్కర్ వెలుగు నింపారు. తన ఆలోచనలతో ఆయన వెయ్యి సంవత్సరాల కులవ్యవస్థపై గట్టి దెబ్బతీశారు. అయితే ఆయన కృషిని కేవలం ఒక దేశానికి, ఒక సముదాయానికి పరిమితం చేయగూడదు’ అని రాహుల్ అన్నారు. అంబేడ్కర్ దళితుల కోసం, మహిళల హక్కుల కోసం కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. కులాన్ని నిర్మూలించాలని అంటూ రాహుల్, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా హక్కు, ఉపాధి హామీ హక్కు వంటి పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. అవి ఏ ప్రత్యేక కులానికో, ప్రాంతానికో కాదని, దేశ ప్రజలందరి కోసం ఉద్దేశించినవని ఆయనన్నారు. అంబేడ్కర్ 125వ జయంతిని జరుపుకోవడం అంటే ఆయన ఎవరికోసం పోరాడారో వాళ్లను గుర్తు చేసుకోవడం కోసమేనని రాహుల్ తెలిపారు. అన్యాయం ఎక్కడుంటే కాంగ్రెస్ అక్కడుంటుందని, ఆదివాసులు, మహిళలు వంటి పీడితుల వైపు కాంగ్రెస్ సదా నిలబడుతుందని ఆయన చెప్పారు.